శేరిలింగంపల్లి, మే 25 (నమస్తే శేరిలింగంపల్లి): వెంకట్ రెడ్డి కాలనీలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఓపెన్ డ్రైనేజీ పనుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థానికులు జోనల్ కమిషనర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. బీఆర్ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదు సమర్పించారు. కాలనీలో డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు పూర్తి చేయకపోవడంతో మురుగు నీరు నిల్వ ఉండి తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతం నివాసయోగ్యంగా లేకుండా మారిందని తెలిపారు. మురుగు నీటి దుర్వాసన వల్ల పిల్లలు, మహిళలు, వృద్ధులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదుపై స్పందించిన జోనల్ కమిషనర్ కార్యాలయ అధికారులు 10 రోజుల్లో సమస్యను పరిష్కరించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానికులు అశోక్, శ్రీధర్, ప్రభాకర్, జ్ఞానేశ్వర్, ఆకాశ్, దశరథ్, కిరణ్, ముక్తేదార్, సలీమ్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.






