శేరిలింగంపల్లి, జూలై 29 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్-ప్రేమ్ నగర్ బి బ్లాక్ మధ్య రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్ కారణంగా జరిగిన ప్రమాదంలో ప్రేమ్ నగర్ బి బ్లాక్‌కు చెందిన బాలయ్య (70) గల్లంతైన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఘటనపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన బాలయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన రవికుమార్ యాదవ్ వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం, సీఎంసీ అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించడంతోపాటు, శాశ్వత పరిష్కారంగా నాలా నిర్మాణ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమ్ నగర్-వైశాలి నగర్ మధ్య నూతన నాలా పైప్‌లైన్ పనుల కోసం తవ్వకాలు చేపట్టిన ప్రాంతంలో కనీస భద్రతా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, మ్యాన్‌హోల్‌ను తెరిచి ఉంచడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శించారు. ప్రమాదం జరిగి దాదాపు 15 గంటలు గడిచినా బాలయ్య ఆచూకీ లభించకపోవడం బాధాకరమని, బాధిత కుటుంబం తీవ్ర వేదనలో ఉందన్నారు. ఈ ఘటన ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత పనులు చేపట్టడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆమోదయోగ్యం కాదని రవికుమార్ యాదవ్ అన్నారు. హఫీజ్‌పేట్ నుంచి మళ్లించిన నాలా కారణంగా ప్రేమ్ నగర్ ప్రాంతంలో బోర్‌వెల్ నీరు కలుషితమై ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారని ఆరోపించారు. నాలా పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేయకుండా తాత్కాలికంగా వదిలేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
ప్రభుత్వం, సీఎంసీ అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించడంతోపాటు, నాలా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజు, రామ్‌రెడ్డి, రెహమాన్, శంకర్, సత్య, విజయ్, మహేష్, ఏడుకొండలు, ఇస్మాయిల్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.





