శేరిలింగంపల్లి, జూలై 29 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌తో కలిసి ఎఫ్‌డీడీఐ బాక్స్ డ్రెయిన్, మల్కం చెరువు, సీఓడీ జంక్షన్, బాటా జంక్షన్ ప్రాంతాల్లో కొనసాగుతున్న స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పనులను సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని సమీక్షించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిశీలనలో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సూపరింటెండింగ్ ఇంజనీర్‌తో పాటు సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ ఎఫ్‌డీడీఐ బాక్స్ డ్రెయిన్ సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో రెక్టాంగ్యులర్ డక్ట్ సెక్షన్లతో క్యాచ్ పిట్లు నిర్మించాలని ఆదేశించారు. సీఓడీ జంక్షన్‌లోని క్యాచ్ పిట్లపై ఎంఎస్ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, బాటా జంక్షన్‌లో బావర్చి రెస్టారెంట్ ఎదురుగా ఉన్న ఆర్‌సీసీ క్యాచ్ పిట్ కవర్ల స్థానంలో కూడా ఎంఎస్ గ్రిల్స్ అమర్చాలని సూచించారు. అదేవిధంగా ఎంకే ఎటర్నల్ మాల్ నుంచి బాటా నాలా వరకు ఉన్న స్టార్మ్ వాటర్ డ్రెయిన్‌ను బాక్స్ కల్వర్ట్‌గా అభివృద్ధి చేయాలని, మెట్రో కారిడార్ వెంబడి ఉన్న ఓవర్‌హెడ్ విద్యుత్ కేబుళ్లను మెట్రో పిల్లర్లకు మార్చే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. గుర్తించిన పనులను సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో వేగవంతంగా చేపట్టి, నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. పనుల అమలులో శాఖల మధ్య సమన్వయం కొనసాగిస్తూ, పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.





