అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప‌రిధిలోని శేరిలింగంపల్లి జోనల్ కార్యాల‌యంలో కమిషనర్ హేమంత్ బోర్ఖడే శుక్ర‌వారం అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జోన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులు, 99 రోజుల ప్రణాళిక లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. 50 శాతానికి పైగా పూర్తయిన పనులను 99 రోజుల ప్రణాళికలోగా పూర్తి చేయాల‌ని, రోడ్లపై గుంతలను గుర్తించి ప్రతి 15 రోజులకోసారి నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. ఏప్రిల్ 15 లోగా పూడికతీత పనులు పూర్తి కావాలని, అమీన్‌పూర్ పార్కు పనుల ఆవశ్యకతను తనిఖీ చేయాల‌ని అన్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా క్రీడల అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాల‌ని, కొత్త స్టేడియాల కోసం ఖాళీ స్థలాలను గుర్తించి సోమవారంలోగా వివరాలు ఇవ్వాల‌ని అన్నారు.

పటాన్‌చెరు పరిధిలోని పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాల‌ని, ఖాజాగూడలోని MJR బిల్డింగ్ సెల్లార్ స్ట్రక్చరల్ అనాలిసిస్ కోసం JNTU అధికారులకు లేఖ రాయాలని ఆదేశించారు. ఫుట్‌పాత్‌లు, మీడియన్ పెయింటింగ్ పనులకు సంబంధించి సర్కిల్ వారీగా ప్రతిపాదనలను సోమవారంలోగా సిద్ధం చేయాల‌ని, ట్రాఫిక్ పోలీసులు గుర్తించిన 18 నీటి నిల్వ పాయింట్ల వద్ద శాశ్వత పరిష్కారాలు చూపాల‌ని, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాల‌ని, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి వారానికోసారి సమీక్షించాల‌న్నారు. అభివృద్ధి పనుల్లో జాప్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఉప కమిషనర్లు, అన్ని విభాగాల ఎస్ఈలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here