మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): సీపీఐ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ నాయకుడు రామకృష్ణ చందు యాదవ్ అన్నారు. ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ సోమవారం శేరిలింగంపల్లి సీపీఐ కమిటీ ఆధ్వర్యంలో మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆ పార్టీ కార్యాలయం ఎదుట నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా రామకృష్ణ చందు యాదవ్ మాట్లాడుతూ పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం, వ్యక్తులపై కేసులు నమోదు చేసినంత మాత్రాన కమ్యూనిస్టులు భయపడరని అన్నారు. నిత్యం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యే ఉంటారని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే తాము ఇలాంటి భౌతిక దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇలాంటి పిరికిపంద చర్యలను ప్రజల మధ్యకు తీసుకెళ్లి రాజకీయంగా ఎదుర్కొంటామని అన్నారు. కమ్యూనిస్టులకు దాడులు, కేసులు కొత్త కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, ఇతర మేథావులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్, ఇ.గోపాల్, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.