శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఓ యువతిపై దాడి చేశారన్న వార్తల్లో వాస్తవం లేదని డివిజన్ టీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్ అన్నారు. సోమవారం డివిజన్ వార్డు కార్యాలయంలో పార్టీ వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శనివారం రాత్రి లక్ష్మీవిహార్ ఫేజ్ 2 లోని తన స్వగృహంలో నిద్రపోతున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని అదే కాలనీకి చెందిన ఓ యువతి కారులో వచ్చి రోడ్డుకు కారు అడ్డంగా లేకున్నా అడ్డుగా ఉందని సెక్యూరిటీతో గొడవపడి మరీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను బయటకు పిలిపించి కారును పక్కకు తొలగించాలని గట్టిగా వాదించిందన్నారు. నాగేందర్ యాదవ్ మర్యాదగా ఆమెతో మాట్లాడుతున్నప్పటికీ ఆమె పక్కా ప్లాన్ ప్రకారం కారులోనుంచే తన ఫోన్ లో కార్పొరేటర్‌ను వీడియో తీసిందని అన్నారు. కార్పొరేటర్ తన కుమారున్ని పిలిపించి కారును పక్కకు పెట్టించారని, ఈ క్రమంలో బనియన్, నైట్ ట్రాక్ వేసుకుని ఉన్న కార్పొరేటర్ ఆ యువతి తండ్రి అయిన వేణుగోపాల్ తో హుందాగా మాట్లాడుతున్న సమయంలో సదరు యువతి కార్పొరేటర్ ను వెంబడిస్తూ తన ఫోన్ లో వీడియోను చిత్రీకరించిందని అన్నారు. ఇది గమనించిన కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ వీడియో ఎందుకు తీస్తున్నావంటూ అడ్డుకోబోయే ప్రయత్నం మాత్రమే చేశారని, ఆమెపై ఎలాంటి దాడికి పాల్పడలేదని పేర్కొన్నారు. నాగేందర్ యాదవ్ బనియన్, ట్రాక్‌పై ఉన్న సమయంలో ఆ యువతి వీడియో తీస్తున్నందుకు ఆమెను వారించబోయే ప్రయత్నం మాత్రమే చేశారని, దీనిని వక్రీకరిస్తూ కొందరు వీడియోలను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేయడం మొదలు పెట్టారని, ఇది తగదని అన్నారు.
వీడియోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాల్లో పోస్టు చేయడం, వార్తల్లోకి ఎక్కించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మహిళలను గౌరవించే నాయకుడు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అని, ఇదే అదునుగా భావించిన కొన్ని ప్రతిపక్ష పార్టీలు తమ ఇష్టారీతిగా నిజానిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. మహిళలను అగౌరవపరిచేలా తమ నాయకుడు, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎన్నడూ ప్రవర్తించలేదని, ఆయన వెంట శేరిలింగంపల్లి డివిజన్ కు చెందిన మహిళాలోకం అంతా ఉందన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ వార్డు సభ్యుల్లో అధికంగా ఉన్నది మహిళలనేనన్నారు. ఐదుగురు వార్డు సభ్యుల్లో ముగ్గురు వార్డు సభ్యులుగా మహిళలను ఎంపిక చేసిన ఘనత కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దేనన్నారు. డివిజన్ లో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ మర్యాద ఇచ్చే నాయకుడు నాగేందర్ యాదవ్ అన్నారు.
ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేని నాయకుడు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అని, రాజకీయంగా అడ్డుకోలేక జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ములేక ప్రతిపక్షాలు గోతి వద్ద నక్కలాగా ఎక్కడ ఏం దొరుకుతుందోనని వేచి చూస్తూ కూర్చోవడం, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడం నీతిమాలిన చర్యగా వారు అభివర్ణించారు. ఇలాంటి రాజకీయ కుట్రలకు తెరలేపితే భవిష్యత్తులో అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు, ఎస్ఎంసీ చైర్మన్ బసవరాజు, వార్డు సభ్యులు శ్రీకళ, కవిత, ఫర్వీన్, టీఆర్ఎస్ పార్టీ నాయకురాళ్లు చంద్రకళ, రజిని, భాగ్యలక్ష్మీ, కుమారి, రోజా, హన్సీ, కళ్యాణి, నాయకులు గోపి, వెంకటేశ్వర్లు, హరి తదితరులు పాల్గొన్నారు.