కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది: ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి

  • టిఆర్ఎస్ పార్టీ ని చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు
  • దేశ సైన్యం లో పని చేశా.. వీళ్లా సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడేది
  • గచ్చిబౌలి రోడ్ షో లో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై మండిప‌డ్డ టిపిసిసి అధ్యక్షుడు
  • కాంగ్రెస్‌కు ఓటు వేసి భ‌ర‌త్‌కుమార్‌ను గెలిపించాల‌ని పిసీసీ పెద్ద‌ల పిలుపు

గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్, ఫార్మా కంపెనీలు, మరెన్నో సంస్థల ఏర్పాటు తో హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందిందని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంలో భారీ రోడ్ షో నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్య నిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి గీత రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డిలతో కలిసి పాల్గొన్న ఉత్తమకుమార్ రెడ్డి స్థానిక పార్టీ అభ్యర్థి అరకల భరత్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ లో 67 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్తున్నా, ఎక్కడ కూడా అందుకు తగ్గట్టు అభివృద్ధి కనిపించడం లేదని తెలిపారు. వర్షాల వల్ల వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడితే బాధితులకు 50 వేలు ఇవ్వమని తాము కోరామని, అయినప్పటికీ 10 వేలు పంచినా పార్టీ నాయకులు పందికొక్కుల్లా దోచుకు తిన్నారని తెలిపారు.

రోడ్ షోలో మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, అభివాదం చేస్తున్న గీతారెడ్డి, గ‌చ్చిబౌలి కాంగ్రెస్ అభ్య‌ర్థి భ‌ర‌త్‌కుమార్

ప్రజలు సమస్యల్లో ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటాడని, ఏడేళ్లుగా రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న టీఆరెస్ పార్టీని ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. నగరం పై అవగాహన లేని బీజేపీ నాయకులు ఎన్నికల్లో వచ్చి మాట్లాడుతున్నారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేపడతామని పిచ్చి పిచ్చి ప్రకటనలు చేస్తున్నారని, తాను సైన్యంలో పనిచేసిన వాడినేనని, సర్జికల్ స్ట్రైక్స్ గురించి తనను అడిగి తెలుసుకోమని అన్నారు. దేశ ప్రధాన మంత్రి మోడీ తన స్థాయిని దిగజార్చుకుని ఎన్నికల వేల హైదరాబాద్ భరత్ బయోటెక్ సంస్థ కు వస్తున్నాడ‌ని, సదరు సంస్థ తమ హయాంలోనే ప్రారంభమైన సంగతి గుర్తు చేసారు. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ పార్టీలో అన్ని పదవులూ అనుభవించి తమ ప్రయోజనాలకోసం పార్టీ ని వదలివెళ్లారని, అంతకుమించి బలమైన నాయకత్వం శేరిలింగంపల్లి లో తయారు కానుందని తెలిపారు. పార్టీ అభ్యర్థి భరత్ కుమార్ గౌడ్ నాయకుడిగా అన్ని విధాలా అర్హుడని గ‌చ్చిబౌలి ప్రజలంతా కాంగ్రెస్ కు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంప‌ల్లి ఎన్నిక‌ల స‌మ‌న్వ‌యక‌ర్త కౌష‌ల్ స‌మీర్‌, ఇంచార్జీ ర‌ఘునంద‌న్‌రెడ్డి, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రోడ్ షోలో ఉత్సాహంగా పాల్గొన్న కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, స్థానిక ప్ర‌జ‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here