నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సర్వే నెంబర్ 174 లోని ప్రభుత్వ స్థలంలో శేరిలింగంపల్లి రెవెన్యూ సిబ్బంది సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. చందానగర్ డివిజన్ పరిధిలోని జవహార్ కాలనీ రోడ్ నెంబర్ 6 లోని ఓ ఖాలీ స్థలాన్ని ప్రైవేట్ భూమిగా పేర్కొంటు కొందరు వ్యక్తులు ఇటీవల రెండు నిర్మాణాలు చేపట్టారు. ఐతే సదరు భూమి సర్వే నెంబర్ 174లోని ప్రభుత్వ భూమిగా పేర్కొంటు ఒక నిర్మాణాన్ని రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. అనంతరం నిర్మాణదారులు రెవెన్యూ సిబ్బందిపై, రెవెన్యూ అధికారులు నిర్మాణదారులపై చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో సర్వే నిర్వహించగా సదరు నిర్మాణాలు చేపడుతున్న స్థలం మొత్తం ప్రభుత్వ సర్వేనెంబర్ 174లోకే వస్తుందని అధికారులు తేల్చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ స్థలంలో ప్రభుత్వ సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ వంశీమోహన్ మాట్లాడుతూ రెండు నిర్మాణాల ప్రాంతం మొత్తం ప్రభుత్వ భూమేనని, ప్రాథమిక దశలోనే ఒక నిర్మాణాన్ని కూల్చడం జరిగిందని, మిగిలిన నిర్మాణాన్ని త్వరలోనే పూర్తిగా తొలగిస్తామని అన్నారు. ఐతే ప్రస్థుతమున్న ఖాలీ స్థలం తిరిగి ఆక్రమణకు గురికాకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.