శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కట్ల చంద్రశేఖర్ రెడ్డి, మాదాపూర్ ఖానామెట్ సింధు హాస్పిటల్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్‌లోని సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపించే వ్యాధులు, రక్తహీనత, శరీర రోగనిరోధక శక్తి, అలాగే ట్రాన్స్‌మిట్ అయ్యే వ్యాధులపై అవగాహన కల్పించారు. మహిళలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సామాజిక కార్యకర్తలు, వైద్య సిబ్బంది, యువత, మహిళలు పాల్గొన్నారు.






