నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బసవ తారక నగర్ వాసుల గుడిసెలు కూల్చిన చోటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం బసవతారక నగర్ బాధితులను సీపీఐ నాయకులను పరామర్శించారు. 30 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని ఉంటున్న పేదలను నిర్దాక్షిణ్యంగా అధికారులు రోడ్డున పడేయడం బాధాకరమని అన్నారు. పసి పిల్లలు, వృద్ధులు చలికి నానా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కూల్చిన స్థలంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు ఎందుకూ పనికిరాని భూములు ఇప్పుడు కోట్ల రూపాయల ధర పలకడంతో పేదలు గుడిసెలను అభివృద్ధి పేరుతో తొలగించి బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెడుతూ ప్రభుత్వ పెద్దలు ఖజానా నింపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బసవతారక నగర్ లో డబల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వకపోతే రాబోయే కాలంలో ఉద్యమాలు చేసి ఈ స్థలంలోనే ఇల్లు నిర్మించుకునేలా పోరాటాలు చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కే. చందు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
