భూ బకాసురుల కోసమే పేదలను ఇబ్బందులపాలు చేస్తున్నరు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి – బసవతారక నగర్ బాధితులకు పరామర్శ

నమస్తే శేరిలింగంపల్లి: కోట్ల రూపాయల విలువ చేసే భూములపై కన్నేసిన భూబకాసురుల ధనదాహం కోసమే పేదల గుడిసెలు కూల్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గచ్చిబౌలి డివిజన్ లోని బసవతారక నగర్ భూ నిర్వాసితులను అఖిలపక్షం నాయకులతో కలిసి రేవంత్ రెడ్డి పరామర్శించారు.

బసవతారక నగర్ బాధితులతో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బసవతారక నగర్ లో 30 ఏళ్ల తరబడి నివసిస్తున్న పేదల స్థలాల మీద కన్నేసిన బడా బాబు కోసమే కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా పేదల గుడిసెలు కూల్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒకప్పుడు చెట్లు, పుట్టలతో నిండి ఉన్న స్థలాల్లో గుడిసెలు వేసుకుని ఏళ్ల తరబడి ఇక్కడే జీవిస్తున్న పేదల గూడు కూల్చి పెద్దలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిన టీఆర్ఎస్ నాయకులు గెలిచాక పేదలను పట్టించుకున్న దాఖలాలు లేవని, వడ్డెరలు కండలు కరిగించి రాళ్లను కొడితే పెద్దలు భవంతుల కట్టుకుంటున్నారు కానీ ఇప్పుడు పేదల కొంపల మీద పడ్డారని అన్నారు. 30 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నవారికి 120 గజాలు ఇవ్వకపోయినా కనీసం 60 గజాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు చేతిలో ఉన్నారని జులుం ప్రదర్శించడం మానుకుని పేదలకు న్యాయం చేయాలని అన్నారు. బసవతారక నగర్ ప్రజలకు న్యాయం చేయకపోగా ఇక్కడి నుండి షెల్టర్ జోన్ లకు తరలిస్తామంటున్నారని, అలా చేస్తే స్థానిక ఎమ్మెల్యే ఇంటినే షెల్టర్ జోన్ గా మారుస్తామని, అక్కడే వంటావార్పు చేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

 

బాధితులకు దుస్తూలు పంపిణీ చేస్తున్న రేవంత్ రెడ్డి, శేరిలింగంపల్లి నాయకులు

టీఆర్ఎస్ నాయకులకు మానవత్వం ఉంటే తక్షణం మున్సిపల్ శాఖమంత్రి ఇక్కడికి రావాలని, పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రేవంత్. బసవతారక నగర్ ప్రజలకు న్యాయం జరిగే వరకు పార్టీలకు అతీతంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాడుతామని, మాజీమంత్రి పేదల పక్షపాతి పీజేఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని, ఆయనే ఉంటే మహానగర ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావని అన్నారు. ఇళ్లు కూల్చిన నాటి నుండి పేదల పక్షాన నిలబడి, వారికి సౌకర్యాలు కల్పించిన స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని రేవంత్ ప్రత్యేకంగా అభినందించారు. ఇకపై కాంగ్రెస్ శ్రేణులు కూడా బసవతారక నగర్ ప్రజలకు అండగా ఉంటాయని, పేదల కోసం పనిచేయాలని శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మన్నె సతీష్, రఘునందన్ రెడ్డి, జైపాల్, రాజు యాదవ్, మహిపాల్ యాదవ్, ఇలియాస్ షరీఫ్, దుర్గం శ్రీహరి గౌడ్, రాజన్, దుర్గేష్, సిపిఐ శేరిలింగంపల్లి నియోజక వర్గ కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం కార్యదర్శి కృష్ణ, ఇసాక్, రాజు, నరేష్, డి. రవి, టీడీపీ నాయకులు, పీడీఎస్ యూ నాయకులు, స్థానికులు రంగయ్య, శివ, బసవతారక నగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న బసవతారక నగర్ బాధితులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here