బోనాల పర్వదినం సందర్భంగా ప్రజలకు ఆరెకపూడి గాంధీ శుభాకాంక్షలు

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 30 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG కాలనీలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి, తొట్టెల ఊరేగింపు కార్యక్రమానికి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం గాంధీ మాట్లాడుతూ.. శ్రావణ మాస బోనాల పర్వదినం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, తాజా మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి కృప, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని గాంధీ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోనాల ఉత్సవాల కోసం రూ.20 కోట్ల నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 92 దేవాలయాలకు మొత్తం రూ.30.71 లక్షల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలు వంటి ఏర్పాట్లను సమన్వయంతో అమలు చేస్తున్నామని గాంధీ పేర్కొన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలను నిర్వహించుకునేలా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here