శేరిలింగంపల్లి, నవంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి శనివారం మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం అన్నమ స్వరార్చన సభక్తి పూర్వకంగా అందించారు. స్వరార్చనలో భాగంగా శ్రీ శారదా సంగీత విద్యాలయం గురువు మంజుల, ఆమె శిష్యులు దాదాపు ముప్పై మంది కలిసి సంయుక్తంగా శరణు గజముఖ, వేడుకొందామా, గురుతెరిగిన దొంగ, బ్రహ్మమొక్కటే, గోవిందాశ్రిత, చిన్ని శిశువు, శరణు శరణు సురేంద్ర సన్నుత, చూడమ్మా సతులాల, జగడపు చనువుల జాజర, తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి అనే కీర్తనలకు స్వరసేవ అందించారు.
వీరికి వయెలిన్ షణ్ముఖశర్మ, మృదంగం మల్లికార్జున్ వాయిద్య సహకారం అందించారు. అనంతరం కళాకారులకు, ముఖ్య అతిథికి అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకులు డా. శోభారాజు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ ఙ్ఞాపికను అందించారు.