శేరిలింగంపల్లి, నవంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ నం.6 సమీపంలో ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో అతను చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అతని వివరాలు తెలియలేదని, వయస్సు బహుశా 40 సంవత్సరాల వరకు ఉంటుందని, బహుశా లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో భిక్షాటన చేస్తుంటాడని, ఎవరైనా గుర్తు పట్టదలిస్తే తమను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.






