నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో నిరుద్యోగులందరికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలు కల్పించాలని, అప్పటివరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఏఐఎఫ్ డీవై నాయకురాలు ఎండి సుల్తానా డిమాండ్ చేశారు. అఖిలభారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(ఏఐఎఫ్‌డీవై) 22వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సుభాష్ చంద్ర బోస్ నగర్, స్టాలిన్ నగర్, నడిగడ్డ తండాలలో ఏఐఎఫ్ డీవై జెండాలను ఆవిష్కరించారు. సుభాష్ చంద్రబోస్ నగర్ లో ఏఐఎఫ్ డీవై యువతుల విభాగం నాయకురాలు ఎండి సుల్తానా సంఘం జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 2018 శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఉద్యోగం వచ్చేవరకు ప్రతి నిరుద్యోగికి రాష్ట్రంలో రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట విస్మరించిందన్నారు.
ఉద్యోగాల కోసం నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారని, కొంత మంది నిరుద్యోగులు ఉద్యోగం రావడం లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. స్టాలిన్ నగర్ లో నర్సింగ్, నడిగడ్డ తండాలో రతన్ నాయక్ జెండాలను ఆవిష్కరించారు. దారలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐఎఫ్ డీవై రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. తుకారం నాయక్, భూసాని రవి, రాజు, డి నరసింహ నాగేశ్వరరావు, మాల్యాద్రి, బాలు నాయక్, జైపాల్, రాజు, లక్ష్మణ్, సత్యనారాయణ, ఎఐఎఫ్ డీ డబ్ల్యు గ్రేటర్ హైదరాబాద్ నాయకురాలు పి.భాగ్యమ్మ, ఎం.రాణి, డి లక్ష్మి, దుర్గ, చాందీ బాయ్ తదితరులు పాల్గొన్నారు.