నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య పై పోరాటం చేయాలని ఏఐఎఫ్ డీవై రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ వి.తుకారం నాయక్ పిలుపునిచ్చారు. ఏఐఎఫ్ డీవై 22వ ఆవిర్భావం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 నుండి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వారం రోజుల పాటు కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ ముజఫర్ నగర్ లో యువత విభాగం నాయకురాలు ఎం.డి సుల్తానా అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఏఐఎఫ్ డీవై రాష్ట్ర ఉపాధ్యక్షులు తుకారం నాయక్ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఏడేళ్ల తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాలు జరపకుండా కేవలం ఎన్నికల వాగ్దానాలకే పరిమితమై నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మభ్య పెడుతుందని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం అని, ఆ తర్వాత 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు జోనల్ వ్యవస్థ అడ్డం ఉందని కల్లిబొల్లి మాటలతో కేసీఆర్ కాలం గడుపుతున్నారని వాపోయారు. నిరుద్యోగ సమస్యను 2023 శాసనసభ ఎన్నికలకు ఒక ప్రచారంగా వాడుకునేలా ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే వరకు ఏఐఎఫ్ డీవై ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో కామ్రేడ్ వి.తుకారాం నాయక్, ఎం.డి సుల్తానాతో పాటు లావణ్య, లక్ష్మి,శివాని శ్రీలత మహిళా సంఘం నాయకురాలు రాణి ఇందిరా, వెంకటేష్, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.