నిత్యావసర ధరలు తగ్గించాలి – జిల్లా కలెక్టర్ కు ఆమ్ ఆద్మీ పార్టీ నేతల వినతి

నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పెంచిన నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ బర్కా కృష్ణ యాదవ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం కన్వీనర్‌ జి. తేజ డిమాండ్ చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. నిత్యావసర సరుకుల ధరలు అధిక స్థాయిలో పెరగడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆనందంగా గడపలేని స్థితిలో ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి ప్రజలకు గుది బండగా మార్చారని వాపోయారు. పెట్రోలు, డీజిల్, కిరోసిన్ లాంటి వస్తు రవాణాతో ముడి పడి ఉన్న ఇంధనాల ధరలు నియంత్రణ మార్కెట్ శక్తులకు వదిలివేసిన కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్పొరేట్ సంస్థలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెరుగుతున్న ధరలను నియంత్రించాలని, డిమాండ్, సరఫరా సమతుల్యం చేయాలని, నిత్యావసర సరుకుల అమ్ముతున్న మల్టీనేషనల్ కంపెనీలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. డొమెస్టిక్ వంటగ్యాస్ ధరలు తగ్గించాలని,ప్రజల కొనుగోలు శక్తిని ఇవ్వడానికి ఉపాధి కల్పన కొరకు వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో గచ్చిబౌలి ఇంచార్జీ ప్రవీణ్ యాదవ్, రామచంద్రయ్య, నరసింహం, గోపాల్, ఎం. గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ధరలు తగ్గించాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here