నమస్తే శేరిలింగంపల్లి: ఔట్ సోర్సింగ్ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి టీమ్స్ ఆస్పత్రి యాజమాన్యానికి సూచించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ (టీమ్స్) లోని ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు చెల్లించక ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి టిమ్స్ ఆస్పత్రికి వచ్చి భరోసా కల్పించారు. ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలపై ఆస్పత్రి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ ఇషాన్ అహ్మద్ ఖాన్ తో చర్చించారు. వేతనాలు చెల్లించి తిరిగి ఉద్యోగంలోకి తీసుకునేలా చూడాలన్నారు. సూపరింటెండెంట్ స్పందిస్తూ కాంట్రాక్టర్ తో మాట్లాడి వారికి లబ్ది చేకూరేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. బిజెపి రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పనిచేయించుకుని వేతనాలు చెల్లించకడమే గాకుండా విధుల్లో నుంచి తొలగించడం దారుణమని అన్నారు. తక్షణమే జీతాలు, పెండింగ్ పిఎఫ్ లు చెల్లించి తిరిగి ఉద్యోగాలలో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవ చేసిన ఔట్‌సోర్సింగ్ స్టాఫ్ నర్సులను ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధుల నుంచి తొలగించడం సరైన పద్ధతి కాదన్నారు. న్యాయం జరిగేంత వరకు ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ బిజెవైఎం కో కన్వీనర్ భరత్, శ్రీధర్, బాలాజీ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.