నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో లో ఆయా రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారుల చేనేత వస్త్రాలను విక్రయిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాల స్టాల్స్ సందర్శకుల కోసం నెల రోజుల పాటు అందుబాటులో ఉండనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ మయూరి కూచిపూడి నృత్యాలయ గురువు రాజనాల శ్రీదేవి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గజాననయుతం, కదిరి నృసింహుడు, నృత్యతి నృత్యతి, కృష్ణం కలయ సఖి, నమశివాయతే, శివుడు తాండవం ఆడెను, జతిస్వరం, ఇదిగో భద్రాద్రి గౌతమీ, శివ లీలలు తదితర అంశాలను నమిత లక్ష్మి, గాయత్రీ, యజ్ఞ, దేదీప్య, దీక్షిత,సుమాన్య, అమూల్య, సాహితి, జిష్ణవి తదితరులు ప్రదర్శించి మెప్పించారు.