నమస్తే శేరిలింగంపల్లి: ఆంగ్లేయుల పాలన నుంచి భరతమాతకు విముక్తి కల్పించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చిన్న వయస్సులో ఉరికంబం ఎక్కిన షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 91 వ వర్థంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు ఏఐఎఫ్ డీవై గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ డి. మధుసూదన్ అన్నారు. స్టాలిన్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మధుసూదన్ పాల్గొని మాట్లాడారు. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్య వాదులను తరిమివేయడానికి, భారతమాత విముక్తి సంకెళ్లను తెంచడానికి అతి చిన్న వయసులో ఉరి కంబాల కు వేలాడిన షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు,సుఖదేవ్ 91వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏఐఎఫ్ డీవై ఆధ్వర్యంలో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, సామ్రాజ్యవాద, మతోన్మాదం నశించాలంటూ మార్చి 23న కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని సామ్రాజ్యవాద దేశాలు తమ ఆధిపత్యం కోసం వివిధ వర్ధమాన దేశాల పై యుద్ధాలు చేస్తూ ఆయ దేశాలను ఆర్థికంగా, పరిపాలన పరంగా నష్ట పరుస్తున్నారని అన్నారు. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, కుల మతాలను ప్రాంతీయతత్వాలు, ప్రజల మధ్య నూరిపోసి వారి అవకాశవాద విధానాలతో పాలకవర్గాలు పరిపాలన కొనసాగిస్తున్నారని వీటికి వ్యతిరేకంగా షహీద్ భగత్ సింగ్ రాజ్ గురు, సుఖదేవ్ ల 91వ వర్ధంతిని జరుపుతూ ప్రజలను, యువతను చైతన్యం చేయడానికి ఏఐఎఫ్ డీవై పూనుకుందన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యమై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ యువతుల విభాగం కన్వీనర్ ఎం.డి. సుల్తానా బేగం, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు డి.కీర్తి, కె.శిరీష్ తదితరులు పాల్గొన్నారు.