నమస్తే శేరిలింగంపల్లి: వామపక్ష కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వామపక్ష కార్మిక సంఘాల నేతలు కృష్ణ మూదిరాజ్, రామకృష్ణ, అనిల్ కుమార్ కోరారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ముజఫర్ హమద్ నగర్ ఎంసిపిఐయు కార్యాలయంలో వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులను కాలరాసే ఎజెండాగా పెట్టుకొని ముందుకు సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను పూర్తిగా కాలరాసేలా మూడు లేబర్ కోడ్ బిల్లు తీసుకొచ్చి పనిగంటల భారం పెంచుతూ ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా బడా పెట్టుబడిదారులకు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీ, రైల్వే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే పనిగా పెట్టుకున్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు మార్చి 28,29 తేదీలలో పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక లోకానికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్త సమ్మెకు అనుగుణంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని భవిష్యత్తులో కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేలా ముందుకు సాగాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష కార్మిక సంఘాల నాయకులు మధు, రమేష్, మున్సిపల్ తదితర రంగాల కార్మికులు పాల్గొన్నారు.