నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ముంపు ప్రాంతాల ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా నాలా పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు నుండి మదీనగూడ మెయిన్ రోడ్డు దీప్తి శ్రీ నగర్ నాలా వరకు రూ.15.88 కోట్ల అంచనా వ్యయంతో 2.4 కి.మీ మేరకు చేపడుతున్న నాలా విస్తరణ పనులను కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. హఫీజ్ డివిజన్ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో నాలా పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దిశానిర్దేశంలో అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, వార్డు సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.