నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచీకరణ పుణ్యమా అని మాతృభాషల ఉనికి ప్రమాదకరంగా మారిందని హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు ఆచార్యులు నడుపల్లె శ్రీరామరాజు అన్నారు. ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్నిపురస్కరించుకొని రాయదర్గా జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్థినీ, విద్యార్థులకు మాతృభాషా ఆవశ్యకతపై ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆచార్య నడుపల్లె శ్రీరామరాజు హాజరై మాట్లాడారు. తెలుగుభాషకు ఉన్న ప్రాధాన్యత మరెందులోనూ లేదన్నారు. భాష అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే భావ వ్యక్తీకరణ మాత్రమే కాదని మనజాతి జీవనాడి, వేల సంవత్సరాల చరిత్రకు, సంస్కృతికి సజీవ సాక్ష్యం అన్నారు. మన సాహిత్యం, మన సంప్రదాయాలు, మన జానపదం అన్ని భాషల్లోనూ ఇమిడి ఉన్నాయని అలాంటి భాషను దూరం చేసుకుంటే మన ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచీకరణ పుణ్యమా అని ఇంగ్లీష్ భాష ఆధిపత్యంగా మారిందన్నారు. దీంతో మాతృ భాషల ఉనికికి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మనిషి జీవితంలో మొదట నేర్చుకొనే భాష అమ్మ భాష అని అమ్మ, మామ అనటం, ఇలా అమ్మతో పాటే సహజంగా నేర్చుకొనేది మాతృ భాష అన్నారు. మాతృ భాషలో ప్రావీణ్యం సంపాదించితే, అన్య భాషలలో ప్రావీణ్యం సంపాదించటం సులభతరం అవుతుందని పరిశీలనలలో వెలువడుతున్నాయని చెప్పారు. ప్రపంచ మాతృ భాషల పరిరక్షణకై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో బంగ్లాదేశ్ లో మాతృభాష ఉనికిని కాపాడుకోవటంలో జరిగిన, నిరసన కార్యక్రమంలో అమరులైన యువకుల జ్ఞాపకార్ధం 1999 లో తీర్మానం చేసి, 2000 ఫిబ్రవరి 21 నుండి ప్రపంచ మాతృ భాషా దినోత్సవాన్ని ఒక నినాదంతో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మాతృ భాషలను కాపాడుకోవాల్సిన సామజిక బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. మాతృ భాష పరిరక్షించబడాలంటే తెలుగు భాషను శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో అభివృద్ధి చేయడమే భాష అభివృద్ధికి పరిష్కార మార్గం అని అన్నారు. ఈ అవసరాన్ని యూనెస్కో వారి లక్ష్యాన్ని తెలియజేస్తుందన్నారు. మాతృ భాష పరిరక్షణకు కట్టుబడి ఉందామని, ఉదర పోషణార్ధం ఆంగ్ల భాష నేర్చుకోవటం తప్పు కాదు కానీ, అమ్మ భాషను మాత్రం ఆదరించడం మరువరాదన్న సత్యాన్ని విస్మరించకూడదని తెలిపారు. అన్యభాషలెన్నైనా నేరువు కానీ అమ్మ భాషను ఒక్కసారైనా నుడువు అనే ఈ సత్యాన్ని ఎప్పటికీ మరువరాదంటూ ప్రబోధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్. అశోక్, మాతృభాషోపాధ్యాయులు భర్తునూరి ఆంజనేయులు, ఆనందం, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కృష్ణ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ నరేందర్ ముదిరాజ్, అధ్యాపకులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాలం శ్రీను, జనార్దన్, విష్ణు ప్రసాద్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.