నమస్తే శేరిలింగంపల్లి: నీళ్లు, నియామకాలు, నిధుల కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేక యువత పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర మాజీ కార్యదర్శి నీరటి చంద్రమోహన్ వాపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు త్వరలో ఉద్యోగాల భర్తీ అనే మాయమాటలు చెప్పడమే తప్పా ఒక్క నియామకం చేపట్టలేదన్నారు. అదిగో నోటిఫికేషన్, ఇదిగో ఉద్యోగాల భర్తీ అంటూ నిరుద్యోగులను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగుల ఆశలను టీఆర్ఎస్ ప్రభుత్వంనీరుగారుస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో లక్షల్లో ఉద్యోగాల నియామకాలు జరుగుతాయని అనుకుంటే నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుందని వాపోయారు. యువత పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దయనీయంగా మారిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు రూ. 3016 నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీని నేటికి నెరవేర్చడం లేదని ఎద్దేవా చేశారు. యువత ఆత్మబలిదానాలు చేసుకునే పరిస్థితిని రానివ్వకుండా రాజభోగాలు అనుభవిస్తున్న పాలకులు సమాధానం చెప్పాలని చంద్రమోహన్ డిమాండ్ చేశారు.