నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఏడు ఎస్టీపీల నిర్మాణం పనులను త్వరలో చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు వద్ద 7 ఎంఎల్ డీ సామర్థ్యం తో రూ. 26.27 కోట్ల అంచనావ్యయంతో నిర్మించనున్న ఎస్టీపీ పనులను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కలిపిస్తుందని చెప్పారు. తాగు నీటి సరఫరా, మురుగు నీటి శుద్ధిలో హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగు నీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మంజూరైన ఏడు ఎస్టీపీల నిర్మాణానికి స్థలాలను కూడా పరిశీలించామని త్వరితగతిన పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. చెరువులు కలుషితం కాకుండా మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి చెరువులను సస్యశ్యామలం, సుందరీకరణ చేసి, ప్రజలకు చక్కటి అహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు వజీర్ తదితరులు పాల్గొన్నారు.