నమస్తే శేరిలింగంపల్లి: కరోనాతో బాధపడుతున్న గర్భిణీ మహిళకు ఎంతో శ్రమతో ఆపరేషన్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా సాధారణ డెలివరీ చేసి తల్లిబిడ్డను సురక్షితంగా కాపాడి కరోనా వ్యాధి సాధారణ డెలివరీకి నిరోధకం కాదని నిరూపించారు మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు. కరోనాతో బాధపడుతున్న నిండు గర్భిణీ అత్యవసర పరిస్థితులలో ప్రసవం కోసం దగ్గరలోని పలు ఆసుపత్రులకు వెళ్లగా కరోనా ఉందనీ, అప్పటికే గర్భాశయ జలాలు విచ్చిన్నం అయ్యాయని ఇలాంటి పరిస్థితులలో సిజేరియన్ కూడా కష్టతరం అవుతుందని, సాధారణ ప్రసవం అసలు చేయలేమని తేల్చి చెప్పినట్లు గర్భిణీ స్త్రీ కుటుంబ సభ్యులు తెలిపారు. మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ లో సీనియర్ కన్సల్టెంట్ అబెస్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎస్ వి లక్ష్మీ ఈ కేసును సవాలుగా తీసుకొని ఎంతో శ్రమించి విజయవంతంగా నార్మల్ డెలివరీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కి సిజేరియన్ కి అసలు సంబంధం లేదని, వేరే ఇతర వ్యాధులు ఉన్నప్పుడు సాధారణ డెలివరీ ఎలా చేయగలమో, కోవిడ్ ఉన్నా అలాగే చేయొచ్చన్నారు. కోవిడ్ తీవ్ర స్థాయిలో ఉంటే పేషెంట్ వెంటిలేటర్ మీదకి వెళ్లే ఆస్కారం ఉంటుందని, అలాంటివారికి సిజేరియన్ చేయవలసి ఉంటుందన్నారు. గర్భాశయ జలాలు విచ్చిన్నమైనా సాధారణ డెలివరీకి ఆస్కారం ఉందన్నారు. కోవిడ్ ని కారణంగా చూపి చికిత్సకు నిరాకరించడం, ఆసుపత్రిలో చేర్చుకోకపోవడం భాదాకరమైన విషయమని, మానవతా కోణంలో ఆలోచించాలని అన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీ తల్లిదండ్రులు మాట్లాడుతూ కరోనాతో బాధపడుతున్న మా కూతుర్ని చూసి చాలా భయపడ్డామని అన్నారు. ఆయా హాస్పిటల్స్ లోకి తీసుకెళ్తే కరోనా ఉంది, గర్భాశయ జలాలు విచ్చిన్నం అయ్యాయని చేతులెత్తేశారని అన్నారు. తెలిసినవాళ్ళు ఇచ్చిన సలహాతో మెడికవర్ ఉమన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ కు తీసుకురాగా సాధారణ డెలివరీ చేసి తల్లీ బిడ్డను కాపాడిన డాక్టర్ లక్ష్మీ కి కృతజ్ఞతలు తెలిపారు.