నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఆరోహన్ స్కూల్ పక్కన జీహెచ్ఎంసీ చేపట్టిన యూజీడీ పనుల్లో నాణ్యత కరువైందని శేరిలింగంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ అధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి వాపోయారు. చందానగర్ సర్కిల్ ఈఈ, సంబంధిత అధికారులు యూజీడీ నిర్మాణం పనులను పరిశీలించక కాంట్రాక్టర్ నాసికరం పనులను చేస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మల్లారెడ్డి అన్నారు. ఓపెన్ మురికి కాలువ కు ఎలాంటి పనులు చేపట్టకుండానే ఓపెన్ నాలా చివరన పెద్ద పైపులు వేసి మ్యాన్ హోల్స్ కట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఓపెన్ మురికికాలువ ద్వారా చెత్తాచెదారం రావడంతో యూజీడీ పైపుల్లో తట్టుకునే ఆస్కారం ఉంటుందనే విషయాన్ని మరవడం సరికాదన్నారు. మ్యాన్ హోల్స్ నిర్మాణంలో ఇసుకకు బదులు డస్ట్ ను వాడుతూ నాసిరకం పనులు చేపట్టినా అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. నాసిరకం పనులను అడ్డుకోకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని మల్లారెడ్డి హెచ్చరించారు.