నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండలం పరిధిలోని 2.27 గుంటల ప్రభుత్వ భూమిని బహిరంగ వేలం వేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా అడిషినల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ వెల్లడించారు. శేరిలింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్ సర్వే నంబర్ 65, 66 లలోని 2 ఎకరాల 27 గుంటల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు టీఎస్ఐఐసీ ద్వారా బహిరంగ వేలం వేయనున్నట్లు చెప్పారు. ఇందుకుగాను గురువారం రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆర్డీఓ చంద్రకళ, టీఎస్ఐఐసీ జోనల్ కమీషనర్ అనురాధ, రాజీవ్ స్వగృహ ఈఈ నందకుమార్, శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది కలిసి వేలం వేయనున్న సర్వే నంబర్ 65, 66 లోని స్థలాన్ని పరిశీలించారు. ఈ భూమిని మూడు విభాగాలుగా విభజించి చదును చేయాలని అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ స్థలం బహిరంగ వేలంపాటలో పాల్గొనేందుకు అసక్తి ఉన్న వారు టీఎస్ఐఐసీ కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు.