నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో, రాష్ట్రంలో ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో, అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి పాటించడం లేదని ఏఐఎఫ్ డీవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ పేర్కొన్నారు. మియాపూర్ స్టాలిన్ నగర్ లో ఏర్పాటు చేసిన ఏఐఎఫ్ డీ వై గ్రేటర్ హైదరాబాద్ విస్తృత స్థాయి సమావేశంలో ఏఐఎఫ్ డీవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ పాల్గొని మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని అన్నారు. బిజెపి ప్రభుత్వం సంవత్సరానికి కోటి ఉద్యోగాలు అని, రాష్ట్ర ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగులను మోసం చేసిందని అన్నారు. ఉద్యోగాల భర్తీ అంశం కేవలం ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వాలు వాడుకోవడమే తప్పా చేసింది ఏమి లేదన్నారు. నిరుద్యోగ సమస్యతో యువతీ, యువకులకు ఉపాధి సమస్య ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. యువత దారిద్ర్యం, ఆత్మహత్యలు,ఆకలి చావులతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే యువజన సమస్యలను పరిష్కరించాలని లేనియెడల ఏఐఎఫ్ డీవై ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మార్చి, ఏప్రిల్ నెలలో జిల్లా, రాష్ట్ర మహాసభలు ఉన్న దృష్ట్యా విస్తృత సమావేశంలో ఏఐఎఫ్ డీవై గ్రేటర్ హైదరాబాద్ స్థాయిలో 17 మంది తో కమిటీని ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ గా డి.మధుసూదన్ ఎన్నికవగా, ఏఐఎఫ్ డీవై గ్రేటర్ హైదరాబాద్ యువతుల విభాగానికి కన్వీనర్ గా ఎండీ సుల్తానా బేగం ఎన్నికయ్యారు. సభ్యులుగా భూసాని రవి, కే రాజు, టి సతీష్, డి కీర్తి, డి. శ్రీనివాసులు, షరీఫ్, టీ నర్సింగ్, రంగస్వామి, రాజేష్, కే.రాజేష్ తదితరులను ప్రకటించారు. డి.శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శ్యామ్ సుందర్, తుకారం నాయక్, జి మహేందర్, సంగమేష్,జి లావణ్య,డి లక్ష్మి, శివాని, అమీనా తదితరులు పాల్గొన్నారు.