నమస్తే శేరిలింగంపల్లి: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం లింకు రోడ్లను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం నుండి హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ రైల్వే ట్రాక్ నుండి ఆర్టీసీ కాలనీ, మురళీధర్ అసోసియేషన్ కాలనీ మీదుగా మదీనగూడ జాతీయ రహదారి 65 జీఎస్ఎం మాల్ వరకు నిర్మించనున్న లింక్ రోడ్డు స్థితిగతులను టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ 30 ఫీట్ల రోడ్డు నుండి 60 ఫీట్ల రోడ్డు వరకు నిర్మించనున్న ఈ లింక్ రోడ్డును ప్రజల సౌకర్యార్థం పనులను వెంటనే చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులకు సూచించారు. లింకు రోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య తీరనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ డీసీపీ గణపతి, ఏసీపీ సంపత్ , టీపీఎస్ రవీందర్, మాజీ కార్పొరేటర్ రంగారావు, నాయకులు పద్మారావు తదితరులు పాల్గొన్నారు.