నమస్తే శేరిలింగంపల్లి: అసంఘటిత కార్మికులకు, రోజువారి పనులు చేసేవారికి ఈ- శ్రమ్ కార్డులు ఎంతగానో ఉపయోగపడుతాయని శేరిలింగంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినీల అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికులకు ఈ- శ్రమ్ కార్డుల నమోదు కార్యక్రమాన్ని ఏఎల్ఓ వినీల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు, దినసరి పనివాళ్లకు పనిచేసే ప్రదేశంలో ఎలాంటి ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగి శారీరక ఇబ్బంది కలిగిన, మరణం సంభవించిన వారికి భారత ప్రభుత్వం తరఫున ఆర్థిక నష్టపరిహారం అందుతుందన్నారు. లింగంపల్లి ప్రాంతంలో ప్రధానంగా మురికివాడల్లోని పేద ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా పాపిరెడ్డినగర్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, అందరికీ కార్డులను జారీ చేసేలా చూస్తామని చెప్పారు. అసంఘటిత రంగ కార్మికులు, దినసరి పనివారు ఈ శ్రమ్ కార్డు కోసం పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాపి రెడ్డి కాలనీ వడ్డెర సంఘం అధ్యక్షులు వల్లెపు కృష్ణ, కమిటీ సభ్యులు నర్సింలు, రాజు, బాబు, చంద్రమౌళి, నాగరాజ్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.