నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ పరిధిలో జరుగుతున్న అక్రమ కట్టడాలను ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీఆర్ఎస్ నాయకులు గంగారం సంగారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం చందానగర్ సర్కిల్ కార్యాలయంలో ఏఎంసీ వహీద్ అలీకి టీఆర్ఎస్ నాయకులు సంగారెడ్డి వినతి పత్రం అందజేశారు. అయ్యప్ప సొసైటీ సర్వే ఆఫ్ ఇండియా లో విచ్చల విడిగా అక్రమ కట్టడాలు చేపడుతూ భవన నిర్మాణదారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని అన్నారు. అక్రమ కట్టడాలను ఆపాల్సిన సంబంధిత అధికారులు విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. చందానగర్ సర్కిల్ అధికారుల అండదండలతో సర్వే ఆఫ్ ఇండియాలో అక్రమ కట్టడాలు వెలుగుచూస్తున్నాయన్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమకట్టడాలను ఆపాలని, చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి విజ్ఞప్తి చేశారు.