నమస్తే శేరిలింగంపల్లి: ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిటిజన్ ఆసుపత్రి నల్లగండ్ల వారి సౌజన్యం తో డాక్టర్ జి కే సుధాకర్ రెడ్డిచే (అర్ధో సర్జన్) కీళ్ల వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం బిహెచ్ ఈ ఎల్ యంఐజీ కాలనీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్ధానికులకు బియండి ( ఎముకల పరీక్షలు) నిర్వహించిన వైద్యులు తగిన సలహాలు, సూచనలు అందించారు. డాక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎముకల చుట్టూ ఉన్న కార్టిలేజ్ పొర అరిగిపోవటం వలన కీళ్లు, మోకాళ్ళ నొప్పులు వస్తాయని అన్నారు. కీళ్లు అరిగిపోవటానికి ముఖ్య కారణం చిన్నప్పటి నుంచి శారీరక వ్యాయామం సక్రమంగా లేకపోవడం వల్ల, అధిక బరువు వల్ల, ఎక్కువ సేపు కూర్చుని ఉండటం వల్ల, పుట్టుకతోనే కాళ్లు వంకరగా ఉండటం వలన మోకాళ్ళు త్వరగా అరిగిపోతాయన్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వలన థైరాయిడ్ సమస్యలతో కీళ్లు, మోకాళ్ళ నొప్పులు, జాయింట్ నొప్పులు వస్తున్నాయని ఆయన అన్నారు. మానవ దైనందిన జీవనానికి ఈ నొప్పులు ఆటంకమన్నారు. నివారణా చర్యలలో భాగంగా కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలైన పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్డు, కీరా, బొప్పాయి పండ్లు తీసుకోవడం మంచిదని తెలిపారు. ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చని, మసాలా వంటకాలను పూర్తిగా మానేయాలన్నారు. నిదురపోయే సమయంలో మోకాళ్ళ కింద మెత్తటి దిండు పెట్టుకోవాలని, బరువులు ఎత్తకూడదని, నడుమును ముందుకు వంచకూడదని తెలిపారు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల వ్యాధులు నాలుగు స్టేజీలు గా ఉంటాయని, మొదటి మూడు దశలలో ఫిజియోధెరపి చేసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయని, నాలుగో స్టేజీలో ఉంటే ఆపరేషన్ అవసరమవుతుందన్నారు. ఎముకల వ్యాధి వచ్చిన వెంటనే అశ్రద్ధ చేయకుండా అర్ధో ఫిజీషియన్, ఫిజీయోధెరపిస్టులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించి ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 150మందికి పైగా కాలనీ వాసులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, సభ్యులు పాలం శ్రీను, విష్ణు ప్రసాద్, యంఐజీ కాలనీ సొసైటీ నాయకులు బాలయ్య, యంఎల్ యం రెడ్డి, కరుణాకర్ రావు, సుబ్బారావు, ఆసుపత్రి ప్రతినిధి జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
