నమస్తే శేరిలింగంపల్లి: సులభంగా డబ్బు సంపాదించాలని దొంగతనాలు చేస్తున్న ఇద్దరు యువకులపై మియాపూర్ పోలీసులు పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం … న్యూ హఫీజ్ పేట్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ మొయిజ్(26), మహమ్మద్ ఇబ్రహీం లో స్నేహితులు. మొయిజ్ పెయింటర్ గా, ఇబ్రహీం సెంట్రింగ్ పని చేస్తున్నారు. కాగా వీరిద్దరూ సులభంగా డబ్బు సంపాదించాలని తాళం వేసి ఉన్న ఇండ్లను చోరీ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే 2020 నవంబర్ 28 వ తేదీ నుండి 2021 జనవరి 18 తేదీ వరకు ఆరు ఇండ్లలో చోరీకి పాల్పడి బంగారం, డబ్బు అపహరించారు. పిర్యాదులందుకున్న మియాపూర్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జనవరి 27వ తేదీన అనుమానాస్పదంగా తిరుగుతున్న మొయిజ్, మహమ్మద్ లను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాలను అంగీకరించారు. దీంతో వారి వద్ద నుండి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిపై పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు.