హైదరాబాద్ మహానగర నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర అద్వితీయమైనది

  • కేంద్ర విపత్తుల శాఖ మంత్రి అమిత్ షా వరదల సమయంలో నగరానికి ఎం సహాయం చేశాడు
  • రోహింగ్యాల అంశం ఎన్నికలప్పుడే ఎందుకు తెరమీదికి తెస్తున్నారు
  • శేరిలింగంపల్లి మీడియా సమావేశంలో ప్రతిపక్షాలను ప్రశ్నించిన పొన్నం ప్రభాకర్
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్

నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ మహా నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, నగర నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర అద్వితీయమైనదని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సుప్రీ స్పోర్ట్స్ స్టేడియం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి టిపిసిసి కార్యదర్శి కౌశల్ సమీర్, సోషల్ మీడియా ఇంచార్జి మన్నే సతీష్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జి రఘునందన్ రెడ్డి లతో హాజరైన పొన్నం ప్రభాకర్ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడారు. హైదరాబాద్ నగర ప్రజలు కరోనా తో విలవిలలాడుతుంటే ముఖ్యమంత్రి చికెన్ తినమని, ప్రధానమంత్రి చప్పట్లు గంటలు కొట్టమని సలహాలు ఇవ్వడమే తప్ప ప్రజలను ఆదుకోలేరని తెలిపారు.హైదరాబాద్ ప్రజలకు దెబ్బ మీద దెబ్బ అన్నట్టు వరదలు ముంచెత్తినప్పుడు కేంద్ర విపత్తుల శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి సహాయం అందించకుండా ఇప్పుడు ఎం మొహం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చారు. ఇరు పార్టీల నేతలు కరోనా, వరదల అంశాలను ఎన్నికల ప్రచారంలో లేవనెత్తకుండా జాగ్రత్త పడుతున్నారని తెలిపారు. వరదల్లో నష్టపోయిన బాధితులకు 50 వేలు ఇవ్వమని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయిస్తే 10 వేలు అందించారని, పంపిణీ సైతం అస్తవ్యస్తంగా నిర్వహించారన్నారు. హైదరాబాద్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ ఎంపీ బండి సంజయ్ ప్రచారం చేస్తున్నాడని, రోహింగ్యాలు ఉంటె కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడే ఈ అంశం ఎందుకు తెరమీదికి తీసుకువచ్చి హైదరాబాద్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. 400 ఏళ్ళ చరిత్ర ఉన్న హైదరాబాద్ పేరును భాగ్యనగరం గా మార్చుతానని యోగి ఆదిత్యనాథ్ అంటున్నారని, ఈ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులు మార్చాలి తప్ప పేరు మార్చడం వల్ల ఎం లాభం లేదని తెలిపారు. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కు, ఎన్నికలప్పుడు హడావిడి చేస్తున్న బిజెపి నేతలకు గ్రేటర్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. శేరిలింగంపల్లి లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొప్పవాళ్లు అని, పదవులు అనుభవించిన నాయకులు పార్టీలు మారినా కార్యకర్తలు మాత్రం పార్టీని వీడలేదు. శేరిలింగంపల్లి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ముస్లిం, క్రైస్తవ మైనారిటీ ఓటర్లు కాంగ్రెస్ వెంటే ఉన్నారని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులుగా స్థానికంగా గుర్తింపు కలిగిన పార్టీ కార్యకర్తలనే ఎంచుకున్నామని, తమ అంచల ప్రకారం 10 డివిజన్లలో 6 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here