కరోనా క్లిష్ట సమయంలో పేద వర్గాలకు బాసటగా నిలుస్తున్న గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేణు గోపాల్ చారి కొనియాడారు. గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ ధనలక్ష్మి, ట్రస్ట్ డైరెక్టర్ గుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో బర్కత్ పుర లోని యాదాద్రి భవన్ లో మెజీషియన్లకు ప్రభుత్వ సలహాదారులు వేణు గోపాల్ చారి చేతుల మీదుగా నిత్యావసర వస్తువులతో పాటు కరోనా మెడికల్ కిట్, చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ చారి మాట్లాడుతూ ప్రపంచదేశాలను ఒణికిస్తున్న కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసర సరుకులను అందిస్తున్న గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ సేవలు అభినందనీయమన్నారు. నగర నలు మూలలా ఉన్న పేద మెజీషియన్ లను స్వచ్ఛందంగా అనుకున్న గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ సేవలు ఎనలేనివన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మెజీషియన్ చొక్కాపు వెంకట రమణ, రమ్య, ట్రస్ట్ సభ్యులు రామస్వామి, భవాని చౌదరి, వరలక్ష్మి, సురేష్, నరేష్, చక్రవర్తి,సత్య తదితరులు పాల్గొన్నారు