నమస్తే శేరిలింగంపల్లి: శివ కేశవులు వేరు కాదని, వారిరువురు ఒక్కటే అనే అద్వైతాన్ని చాటుతూ శ్రీ ధర్మపురి క్షేత్రంలో గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఆలయ వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి తెలిపారు. గురువారం సాయంత్రం వైశాఖ శుద్ధ ఏకాదశి శివకేశవుల వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని సత్యవాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరిమెళ్ళ సహస్రావధాని వరప్రసాద్ వ్యాఖ్యానంతో, వేద మంత్రోచ్ఛారణల మధ్య, కోలాటాల బృందంతో అంగరంగ వైభవంగా కళ్యాణాలు జరిగాయి.

ఉదయం 6 గంటలకు మంగళధ్వనితో ప్రారంభించి, గణపతి పూజ, దీక్ష ధారణ,108 కలశములతో ధ్రువ మూర్తులకు, కల్యాణ మూర్తులకు అభిషేకాదులు, నీరాజన, మంత్ర పుష్పములు తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ భ్రమరాంబికా సమేత దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణం ఒకే వేదికపై ఒకే ముహూర్తాన చూడముచ్చటగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివకేశవుల ఆశీర్వాదం తీసుకున్నారు.

