నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత వేంకటేశ్వరాలయ సముదాయం రజతోత్సవాల్లో భాగంగా మూడవ రోజు గురువారం హరిహరుల వైభవోత్సవాలు ఘనంగా జరిగాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరపీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వార్ల పర్యవేక్షణలో శ్రీ వరాహ స్వామి వారికి అభిషేకం, పంచగవ్యాధివాసం, నవగ్రహ పంచాయతన చతుర్యుగ దేవతారాధనలు, చండి హోమం నిర్వహించారు.
రాజశ్యామల అమ్మవారికి పీఠార్చన…
శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిలు స్వహస్తాలతో పీఠార్చన నిర్వహించి నక్షత్ర హారతులిచ్చారు. దాంతోపాటు అనేక పూజా కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయ. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగగా, చందానగర్ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ వెళ్లివిరిసింది.
స్వరూపానందేంద్ర ఆశీర్వాదం తీసుకున్న ప్రముఖులు…
వైభవోత్సవాల్లో భాగంగా చందానగర్ ఆలయంలోనే బస చేస్తున్న స్వరూపానందేంద్ర మహాస్వామి, స్వాత్మానందేంద్ర స్వామి వార్లను గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్, సినీనటుడు మురళీ మోహన్‌లను ఇరువురు స్వాములు ఆశీర్వదించి ప్రసాదం అందజేశారు.
ఆభరణాల సమర్పణ…
అలయ మహారాజ పోషకాలు శ్రీ కలిదిండి సత్యనారాయణ రాజు జాన్సీలక్ష్మీ దంపతులు స్వామి వారికి స్వర్ణణాభరణాలు సమర్పించారు. బి.శ్రీనివాసరావు సుష్మ దంపతులు పద్మావతి గోదాదేవి అమ్మవార్లకు స్వర్ణణాభరణములు సమర్పించారు. ఆలయ ప్రధాన కార్యదర్శి శ్రీ T.సుభాష్ సుమతి పుణ్య దంపతులు భూ వరాహ స్వామి వారి శిలా విగ్రహం మరియు వెండి ఆభరణాలు సమర్పించారు.