నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత శ్రీ వేంకటేశ్వరాలయంలో 26వ షడ్వింశ బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజున ఉదయం 10.30 గంటలకు గణపతి పూజ, పుణ్య హవచనం, దీక్షారాధన, 11 గంటలకు అకల్మష హోమం, హారతి, తీర్థప్రసాదాల వితరణ జరిగాయి. సాయంత్రం పుట్ట మన్ను తీసుకువచ్చి అంకురార్పణ, అగ్ని మధనం, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ, శేష వాహన సేవ తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, ఉత్తర పీఠాధిపతి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి దివ్యాశీస్సులతో ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం సత్యసాయి ఆచార్యుల పర్యవేక్షణలో శ్రీ వేంకటేశ్వర స్వామి షడ్వింశ బ్రహ్మోత్సవాలు నవంబర్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు రఘుపతి రెడ్డి వెల్లడించారు.