చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జగద్గిరిగుట్టలోని హనుమాన్ నగర్‌లో నివాసం ఉండే బిశాల్ సోనీ (18) కూకట్‌పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తోంది. కాగా ఆమె శేరిలింగంపల్లిలోని గుల్‌మోహర్ పార్క్ కాలనీలో ఉన్న తన సోదరుడు ప్రధాన్ జైరాం ఇంటికి 2 రోజుల కిందట వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీన ఆమె ఉదయం 8 గంటలకు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. అనంతరం తిరిగి రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం అన్ని చోట్లా గాలించారు. అయినా ఆమె ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో వారు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.