చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): భర్తతో గొడవపడిన భార్య ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన కుమారుడిని తీసుకుని బయటకు వెళ్లి అదృశ్యమైంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
చందానగర్ లోని పాపిరెడ్డి కాలనీలో నేతాజీ రోడ్డులో నివాసం ఉండే వెంకటేశ్వర్లు స్థానికంగా తాపీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 9 ఏళ్ల కిందట ఇతనికి రాజేశ్వరి (28) అనే మహిళతో వివాహం అయింది. వీరికి మనోజ్ (7), వినయ్ (4)లు సంతానం. కాగా రాజేశ్వరి టైలరింగ్ పని చేస్తూ ఉండేది. ఈ క్రమంలోనే అక్టోబర్ 26వ తేదీన రాత్రి 10 గంటలకు ఆమె ఫోన్ లో మాట్లాడుతుండడం చూసి వెంకటేశ్వర్లు వద్దని హెచ్చరించాడు. మరుసటి రోజు ఉదయం అతను యథావిధిగా పనికి వెళ్లి సాయంత్రం 6 గంటలకు ఇంటికి తిరిగి రాగా తన భార్య రాజేశ్వరి, చిన్న కుమారుడు వినయ్ కనిపించలేదు. ఆమె అతన్ని తీసుకుని బయటికి వెళ్లి ఉంటుందని భావించి వారిద్దరి ఆచూకీ కోసం వెంకటేశ్వర్లు చుట్టు పక్కల, తెలిసిన వారి వద్ద, బంధువుల ఇళ్లలో విచారించాడు. అయినా ఫలితం లేకపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా వారే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.