మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని హఫీజ్‌పేట ప్రేమ్ నగర్ ఎ బ్లాక్‌లో చైతన్య స్కూల్ సమీపంలో వీధి నం.20లో నివాసం ఉండే మంజల రాములు (65) కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తె ద్యారంగుల మంగమ్మకు 12 ఏళ్ల కిందట రవి అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె సంతానం. కాగా మంగమ్మ, రవిలకు కలహాలు రావడంతో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో మంగమ్మ తన తండ్రి రాములు వద్దే ఉంటూ హౌజ్ కీపింగ్ పనులు చేస్తూ జీవిస్తోంది.
కాగా ఈ నెల 11వ తేదీన రాత్రి 8.30 గంటల సమయంలో రాములుకు, అతని భార్యకు మధ్య గొడవైంది. దీంతో మంగమ్మ బయటకు వెళ్లి నిద్రించింది. మరుసటి రోజు.. 12వ తేదీ ఉదయం 5.30 గంటల సమయంలో తన తండ్రిని నిద్ర లేపేందుకు వెళ్లగా అతను చనిపోయి పడిఉన్నట్లు ఆమె గుర్తించింది. పక్కనే పెద్ద రాయి ఉందని, అతని తలకు రక్తస్రావం అయిందని గుర్తించింది. దీంతో ఆమె స్థానికుల సహకారంతో పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాములును తలపై రాయితో బలంగా మోది హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.





