OLX మోసాల ప‌ట్ల ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి: సీపీ వీసీ స‌జ్జ‌నార్

  • OLX మోసాల‌పై తీసిన షార్ట్ ఫిలింను విడుద‌ల చేసిన సీపీ స‌జ్జ‌నార్
  • న‌టి వ‌ర్షిణి, విద్యార్థిని సింధు, షార్ట్ ఫిలిం డైరెక్ట‌ర్ హైమ‌ల‌కు సీపీ స‌న్మానం

సైబ‌రాబాద్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): OLX వంటి సైట్ల‌లో జ‌రుగుతున్న మోసాల ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సైబ‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జనార్ అన్నారు. OLX మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రముఖ నటి, వ్యాఖ్యాత వర్షిణి, కాలేజీ విద్యార్థిని సింధు సంగం కలిసి నటించిన షార్ట్ ఫిల్మ్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తన ఛాంబర్‌లో విడుదల చేశారు. షార్ట్‌ఫిల్మ్‌లో నటించిన వర్షిణి, సింధు సంగం, షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్, స్క్రిప్ట్, డైరెక్షన్, ఎడిటర్‌ హైమను సజ్జనార్ అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ లక్ష్మీ నారాయణ, ఎస్టేట్ ఆఫీసర్ సంతోష్, ఆర్ఐ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

షార్ట్ ఫిలింను విడుద‌ల చేసిన అనంత‌రం వీక్షిస్తున్న సీపీ వీసీ స‌జ్జ‌నార్

ఈ సంద‌ర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ OLX మోసాల విష‌యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సెకండ్‌ హ్యాండ్‌ వస్తువుల పేరిట క్రయవిక్రయాలు జరిపే ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ను సైబర్‌ నేరగాళ్లు అక్రమ సంపాదనకు అడ్డాగా మార్చుకుంటున్నార‌ని తెలిపారు. తాము ప్రభుత్వోద్యోగులమంటూ, ఆర్మీ అధికారులమంటూ ప్రచారం చేసుకుంటూ తక్కువ ధరకే విలువైన కార్లు, కెమెరాలు అమ్ముతామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నార‌ని తెలిపారు. కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నా చాలా మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేద‌ని తెలిపారు.

న‌టి వ‌ర్షిణి, విద్యార్థిని సింధు, షార్ట్ ఫిలిం డైరెక్ట‌ర్ హైమ‌ల‌ను స‌న్మానించిన సీపీ సజ్జ‌నార్

ఈ సంద‌ర్భంగా OLX మోసాల ప‌ట్ల అప్రమత్తంగా ఉండేందుకు సీపీ సజ్జనార్‌ పలు సూచనలు చేశారు.

* వ‌స్తువును ప్రత్యక్షంగా చూడకుండా వెబ్‌సైట్‌ల‌‌లోని ప్రకటనల‌ను న‌మ్మ‌వ‌ద్దు.
* వస్తువును విక్రయించే అసలు యజమానులు ధరను కచ్చితంగా చెబుతారు. సైబర్‌ క్రిమినల్స్‌ ఇచ్చే ప్రకటనల్లో వస్తువుకు సరైన ధర ఉండదు.
* వస్తువు డెలివరీ కాకముందే నగదు ఇవ్వొద్దు.
* వస్తువులను కొనుగోలు చేయాలన్నా, విక్రయించాలన్నా అసలైన వెబ్‌సైట్లనే ఎంపిక చేసుకోవాలి.
* నగదు వాపసు వస్తుందంటే నమ్మొద్దు.
* గుర్తు తెలియని వ్యక్తులు ఓఎల్‌ఎక్స్‌ ప్రకటనలకు సంబంధించి క్యూఆర్‌ కోడ్‌లు పంపిస్తే వాటిని స్కాన్ చేయొద్దు.
* క్యూఆర్‌ కోడ్‌ ద్వారా డబ్బులు చెల్లించమంటే అది మోసమని గ్రహించాలి.
* OLX‌ వేదికగా ఆర్మీ అధికారులు, పోలీసు అధికారులమని ఇచ్చే ప్రకటనలకు బోల్తా పడొద్దు. వాటిని ప్రత్యక్షంగా చూసిన తర్వాతే కొనుగోలు చేయాలి. కేవలం ఫొటోల ద్వారానే వ‌స్తువుల‌ను అమ్ముతామ‌ని చెబితే అది ముమ్మాటికీ మోస‌మేన‌ని గ్ర‌హించాలి.
* ప్రకటనల‌లో ఉన్న వివరాలను సరి చూసుకోవాలి.
* మిలటరీ, ఇతర పారా మిలటరీ అధికారులమంటూ పెట్టే ఫొటోలను అసలు నమ్మొద్దు.
* అడ్వాన్స్‌ డబ్బును వాహనం రిజిస్ట్రేషన్‌ అవ్వగానే ఇస్తామంటే అసలు నమ్మొద్దు.
* ప్రత్యక్షంగా కలిసి పత్రాలన్నింటిని స్వయంగా పరిశీలించి, ఆ త‌రువాతే వ‌స్తువుల‌ను, వాహ‌నాల‌ను కొనాలి.
* సైబర్ నేరాలపై ముఖ్యంగా OLX మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఫిర్యాదు కోసం డయల్ 100 లేదా 9490617444 వాట్సాప్ నంబర్ ను సంప్రదించాలి.

OLX మోసాలపై తీసిన షార్ట్ ఫిలిం…

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here