మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): భర్త, ఆడపడుచుల వేధింపులకు భరించలేక ఓ వివాహిత తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని న్యూ హఫీజ్‌పేట ప్రేమ్‌నగర్‌కు చెందిన నరసింహులుకు, మల్ల వినోద (25)కు 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. కాగా 3 నెలల కింద నరసింహులుతోపాటు వినోద ఆడపడుచులు తమకు రూ.3 లక్షలు అదనపు కట్నం కావాలని వినోదని అడిగారు. దీంతో వినోద తన తండ్రికి ఫోన్ కాల్ చేయగా అతన రెండు దఫాలుగా రూ.50వేలు, మొత్తం రూ.1 లక్షను నరసింహులు అకౌంట్‌లో వేశాడు. కాగా 15 రోజుల అనంతరం వినోద తోటి కోడలు తనకు రూ.1 లక్ష కావాలని వినోదను అడిగింది. దీంతో వినోద మళ్లీ తండ్రికి విషయం ఫోన్ చేసి చెప్పగా.. అతను తన వద్ద డబ్బు లేదని, తరువాత ఇస్తానని చెప్పాడు. కాగా ఈ నెల 15వ తేదీన ఉదయం 8 గంటలకు నరసింహులు తన భార్య వినోద ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పగా అదే రోజు సాయంత్రం 4 గంటలకు అతను నగరానికి చేరుకుని తన కుమార్తె మృతదేహాన్ని చూశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని వినోద మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తన కుమార్తె భర్త, ఆడపడుచులు, తోటి కోడలు వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని వినోద తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.