నమస్తే శేరిలింగంపల్లి: పోలీసుల డ్రంక్ ఆండ్ డ్రైవ్ చెకింగ్‌ను నుంచి తప్పించుకోబోయి రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా, మరొక యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం మల్కిపురం గ్రామానికి చెందిన సోదరులు గణేష్ రాజు, చైతన్య వర్మలు బొరబండ వివేకానందనగర్‌లోని వారి పెద్దనాన్న రాజు ఇంట్లో నివాసం ఉంటున్నారు.
చైతన్యవర్మ శంకర్‌పల్లిలోని ఐబీఎస్‌లో, గణేష్ రాజు పంజగుట్టలోని అమిటి కాలేజీలో బీబీఎం చదువుతున్నారు. ఐతే శనివారం సాయంత్రం సోదరులు ఇరువురు తమ బీఎండబ్ల్యూ బైక్ (TS08HJ2371)పై భాగ్యనగర్ సొసైటీ వైపు వెళుతున్నారు. ఐతే ఆ మార్గంలో పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ చెకింగ్ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న సోదరులు చెకింగ్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వివేకానందనగర్ నుంచి ఎన్ఐఏ వైపు వెళ్లే కొత్త రోడ్డులో విస్తార అపార్ట్‌మెంట్ ఎందురుగా బైక్ యూటర్న్ తీసుకుంటుండగా కియా కార్ ( TS07HM5757)ను ఢికొట్టారు. దీంతో డ్రైవింగ్ చేస్తున్న గణేష్ రాజు తీవ్రంగా గాయపడగా, వెనకాల కూర్చున్న చైతన్య వర్మ అక్కడికక్కడే మృతిచెందాడు. గాయాల పాలైన గణేష్ రాజును స్థానిక మెడికవర్ హాస్పిటల్‌కు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కియా కార్ డ్రైవర్ రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.