నమస్తే శేరిలింగంపల్లి: పాకిస్థాలో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచులపై ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఒటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారంలో కీలక సూత్రధారి పరారిలో ఉండగా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్దనుండి దాదాపు రూ.23 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం కమీషనరేట్‌లో నిర్వహించిన సమావేశంలో సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు.
తూ.గో.జిల్లా ప్రాంతానికి చెందిన సోమన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నాడు. ప.గో.జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన గుంటూరి సత్యపవన్ కుమార్, ఉద్దరరాజు సతీష్‌రాజులు సోమన్న నుండి బెట్టింగ్ లైన్ యాక్సెస్ చేస్తూ ఆర్గనైజర్లుగా పనిచేస్తున్నారు. దీంతో పాటు సోమన్నబెట్టింగ్ ఆపరేటర్లుగా మచిలీపట్నంకు చెందిన సి.హెచ్.త్రినాథ్, కృష్ణా జిల్లాకు చెందిన నందిపాము భాస్కర్, ప.గో.జిల్లా అకివీడుకు చెందిన జక్కపూడి ప్రసాద్ లను నియమించాడు. వీరి అన్‌లైన్ వ్యవస్థలో నగరానికి చెందిన పలువురు బుకీలతో లావాదేవీలు నిర్వహిస్తూ ఉన్నారు. సాధారణంగా బెట్టింగ్ లావాదేవీలు ఆన్‌లైన్ ద్వారా, ప్రముఖ బెట్టింగ్ యాప్‌ల ద్వారా నిర్వహించినప్పటికీ, సోమన్న, పవన్ కుమార్, సతీష్ రాజు లు హవాలా ద్వారా నగదు బదిలీలను సైతం నిర్వహించడం గమనార్హం.
ఆన్‌లైన్ బెట్టింగులపై కొద్దికాలంగా నిఘా ఉంచిన మాదాపూర్ ఎస్ఒటి పోలీసులు విశ్వసనీయ సమాచారంతో నిజాంపేట బండారి లే ఔట్‌లోని పావని రెసిడెన్సీలో ఉంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఈ ముఠాను అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి సోమన్న పరారీలో ఉండగా మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి 20.5 లక్షల నగదు, బెట్టింగ్ బోర్డు, ల్యాప్‌టాప్, ఎమ్ఐ టివితో పాటు 33 మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.23.80 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ముఠా వద్ద ఎంతోమంది యువకులు బెట్టింగ్ లో పాల్గొని పెద్దమొత్తంలో నగదు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ముఠాను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన మాదాపూర్ ఎస్ఒటి డిసిపి సుందీప్, ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్ బృందాన్ని కమీషనర్ సజ్జనార్ అభినందించారు.