- అధికారుల తీరుపై కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి మండిపాటు
చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులతో కలిసి ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశానికి ప్రస్తుతం ప్రజాప్రతినిధి హోదా లో ఉన్న తమను ఆహ్వానించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి ఓ ప్రకటనలో అన్నారు. తమ పదవీకాలం ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుందని, అప్పటివరకూ తాము కార్పొరేటర్ గా కొనసాగే హక్కు కలిగి ఉన్నట్లు తెలిపారు. అయినప్పటికీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిహెచ్ఎంసి అధికారులు నిర్వహించిన సమావేశంలో తమను కాదని కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో సమావేశమవ్వడం అధికారుల అవగాహన లోపంగా భావిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులకు సదరు విషయం తెలియకపోయినా చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని గుర్తు చేశారు. కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేయకుండానే ప్రజాప్రతినిధి హోదాలో సమావేశాలకు హాజరవ్వడం సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27వ తేదీన జరిగే జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ లుగా హాజరయ్యేది తమేనన్న విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజాప్రతినిధుల మరియు అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విషయాన్ని జిహెచ్ఎంసి కమిషనర్ దృష్టికి మరియు కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లి ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యను కౌన్సిల్ లో ఎండకడతామని హెచ్చరించారు.