శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమాచార్య సంకీర్తనల ప్రచారం, ఆధ్యాత్మిక సంగీత సేవకు నాలుగు దశాబ్దాలకు పైగా అంకితమై సేవలందిస్తున్న అన్నమాచార్య భావనా వాహిని సంస్థ 43వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 30న అంకితభావ దినోత్సవం నిర్వహించనుంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు అన్నమయ్యపురంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రామకృష్ణ మిషన్, హైదరాబాద్ అధ్యక్షుడు బోధమయానంద స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో పాటు తందనానా ప్రత్యేక చిత్రపటాన్ని ఆవిష్కరించనున్నారు.

అనంతరం పద్మశ్రీ డాక్టర్ శోభారాజు ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తనల ప్రత్యేక సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రముఖ గాయనీమణులు స్వప్న, నిత్య సంతోషిణి, గాయత్రి నారాయణన్, సాందీప్తో పాటు అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించి సంగీతాభిమానులను అలరించనున్నారు. ఈ సందర్భంగా ఏకతత్త్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పావని డొక్కా ప్రసంగించనున్నారు. ముఖ్య అతిథి బోధమయానంద స్వామీజీ ఆధ్యాత్మిక సందేశంతో పాటు ఆశీస్సులు అందించనున్నారు. కార్యక్రమం ముగింపులో మంగళహారతి, ప్రసాద వితరణ నిర్వహించనున్నారు.
అన్నమయ్య సంకీర్తనల ద్వారా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ, తెలుగు సంగీత, సాహిత్య సంప్రదాయాల పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న అన్నమాచార్య భావనా వాహిని 43 ఏళ్ల ప్రస్థానంలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు డాక్టర్ నందకుమార్, పి.పి. రాజ్, భక్తులు, సంగీతాభిమానులు, శ్రేయోభిలాషులకు ఆత్మీయ ఆహ్వానం పలికారు.





