సైబరాబాద్‌లో ప్రతిరోజూ ఒక వార్డు రెండో విడత

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం, పౌర సదుపాయాల మెరుగుదలే లక్ష్యంగా కమిషనర్ డాక్టర్ జి. సృజన ప్రతిరోజూ ఒక వార్డు – రెండో విడత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు నాలుగు రోజులపాటు ఉదయం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ పర్యటనల్లో ఒక బస్తీని సందర్శించడంతోపాటు మూడు వార్డులను తిరిగి పరిశీలించనున్నారు. పారిశుద్ధ్యం, పౌర మౌలిక సదుపాయాలు, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతను క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నారు. గత తనిఖీల్లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యల పురోగతిని కూడా పరిశీలించనున్నారు.

నవంబర్ 30 సోమవారం సాయి నగర్ వార్డు నం. 276, ప్రగతి నగర్, నిజాంపేట్ సర్కిల్-58, కుత్బుల్లాపూర్ జోన్ ల‌లో, డిసెంబర్ 1, మంగళవారం వార్డు నం. 268, రామచంద్రపురం (ఆర్‌సీ పురం), అమీన్‌పూర్ సర్కిల్-47, శేరిలింగంపల్లి జోన్, డిసెంబర్ 2, బుధవారం వార్డు నం. 230, అంజయ్య నగర్, మాదాపూర్ సర్కిల్-50, కూకట్‌పల్లి జోన్, డిసెంబర్ 3, గురువారం వార్డు నం. 284, గణేష్ నగర్, జీడిమెట్ల సర్కిల్-55, కుత్బుల్లాపూర్ జోన్ ల‌లో త‌నిఖీలు చేప‌డ‌తారు. ఈ తనిఖీలకు సంబంధిత జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, వార్డు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కమిషనర్ ఆదేశించారు. గత తనిఖీల్లో గుర్తించిన సమస్యలపై తీసుకున్న చర్యలు, ఇంకా పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలు, వాటి పరిష్కారానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికతో అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణను బలోపేతం చేయడం, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచడం, ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here