శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): కుత్బుల్లాపూర్ కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం ఆత్మీయత, ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. నిర్వాహకుడు బొడ్డు రవిశంకర్ ఆహ్వానం మేరకు మియాపూర్ నాయకుడు, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా కేజీఎఫ్ వ్యవస్థాపకుడు, ఏఐసీసీ సెక్రటరీ జెట్టి కుసుమ, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, వైస్ చైర్మన్ పరుచూరి మురళి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ పృథ్వీ చౌదరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక పెద్దలు, సీనియర్ సిటిజన్లు, యువత, మహిళలు, కుటుంబ సభ్యులతో అతిథులు ఆత్మీయంగా మమేకమై పరస్పరం పలకరించుకున్నారు. స్నేహాభిమానాలను పంచుకుంటూ వనభోజనాల వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్తీక మాసం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు ఎంతో విశిష్టమైనదని పేర్కొన్నారు. ఇలాంటి సామూహిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఆత్మీయత, సోదరభావం, ఐక్యతను పెంపొందించడంతో పాటు సామాజిక బంధాలను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. వనభోజనాలు కేవలం సంప్రదాయ వేడుకలు మాత్రమే కాకుండా, వివిధ వర్గాల ప్రజలు ఒకే వేదికపై కలుసుకుని తమ అనుబంధాలను, ఆప్యాయతలను పంచుకునే సామాజిక వేడుకలని పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ వాటి విలువలను కాపాడడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో కోటపాటి మురళి, సూర్యదేవర అవినాష్, శరత్, రాధాకృష్ణ, వంశీ, ప్రవీణ్, నాగసాయి తదితరులు పాల్గొన్నారు. స్థానికులు, సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై వనభోజనాల వేడుకను విజయవంతం చేశారు. సంప్రదాయం, ఆత్మీయత, సామాజిక ఐక్యతకు ఈ కార్యక్రమం ప్రతీకగా నిలిచింది.





